Home   »  జాతీయం   »   ఆదిత్య-ఎల్1 ప్రయోగం… సూర్యునిపై పరిశోధనకు చేయనున్న ఇస్రో

ఆదిత్య-ఎల్1 ప్రయోగం… సూర్యునిపై పరిశోధనకు చేయనున్న ఇస్రో

schedule raju

భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి తేదీ ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 2న ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి రాకెట్ లాంఛ్ జరగనుందని ఇస్రో సోమవారం ప్రకటించింది. రెండు వారాల క్రితమే ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు తీసుకువచ్చామని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు.

సూర్యుడి-భూమి క‌క్ష్య‌లోని లెగ్రాంజ్ పాయింట్(ఎల్‌-1) వ‌ద్ద ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఉంచుతారు. ఆ పాయింట్ భూమికి దాదాపు 1.5 మిలియ‌న్ల కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఎల్‌-1 పాయింట్‌లో శాటిలైట్‌ను నిల‌ప‌డం వ‌ల్ల‌ సూర్యుడిని నిరంత‌రం చూసే అవ‌కాశం ఉంటుంద‌ని ఇస్రో ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది.

ఆదిత్య-L1 మిషన్, లెగ్రాంజ్ పాయింట్(ఎల్‌-1) చుట్టూ ఉన్న కక్ష్య నుండి సూర్యుడిని అధ్యయనం చేసే లక్ష్యంతో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని యొక్క బయటి పొరలను, వాతావరణంను వివిధ వేవ్‌బ్యాండ్‌లలో పరిశీలించడానికి ఏడు పేలోడ్‌లను తీసుకువెళుతుంది. ఆదిత్య-ఎల్1 అనేది జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ ప్రయత్నమని ఇస్రో అధికారి తెలిపారు.

చంద్రయాన్ తరహాలోనే సూర్యయాన్ కూడా సాగనుంది. ఈ రాకెట్ ఆదిత్య ఎల్ 1 స్పేస్ క్రాఫ్ట్ ను ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకెళ్లి వదులుతుంది. ఆ తరువాత ఆదిత్య ఎల్ 1 భూమి చుట్టూ తిరిగి గ్రావిటేషనల్ ఫోర్స్ ను వాడుకుంటూ మూమెంటమ్‌ను క్రియేట్ చేసుకొని సూర్యుడి చేరువలోకి వెళ్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ సూర్యుడి వాతావరణం చుట్టూ తిరుగుతూ వివిధరకాల కిరణాలు, సౌర తుపానులు లాంటి అంశాలను గ్రహిస్తూ ఆ వివరాలను ఇస్రోకు అందిస్తుంది. వాటిపై ఇస్రో మరింత పరిశోధన చేస్తుంది.