Home   »  జాతీయం   »   BSF పోస్ట్‌లపై పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు.. గాయపడ్డ ఇద్దరు జవాన్లు

BSF పోస్ట్‌లపై పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు.. గాయపడ్డ ఇద్దరు జవాన్లు

schedule mahesh

జమ్మూ: జమ్మూలోని అర్నియా, సుచేత్‌ఘర్ సెక్టార్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి పాకిస్తాన్ రేంజర్లు భారీ కాల్పులకు పాల్పడడంతో చాలా మంది పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలలో తలదాచుకున్నారు.

BSF పోస్ట్‌లపై పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు

ఈ కాల్పులలో ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు, ఒక మహిళ గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. గురువారం రాత్రి 8 గంటలకు ఆర్నియా ప్రాంతంలోని BSF పోస్ట్‌లపై పాకిస్తాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరిపారు.

గాయపడ్డ ఇద్దరు జవాన్లు, ఒక మహిళ

దీనికి BSF దళాలు తగిన విధంగా ఎదురుకాల్పులు జరుపుతున్నాయి. ఆర్నియా సెక్టార్‌లో 6 గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత పాక్ రేంజర్లు సుచేత్‌ఘర్ సెక్టార్‌లోని మూడు గ్రామాలపై కాల్పులు జరిపారు.

పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మోర్టార్ షెల్స్‌తో దాడులు

పాక్ రేంజర్లు పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మోర్టార్ షెల్స్‌తో దాడులకు పాల్పడ్డారు. రాత్రి 11 గంటల వరకు భారీ కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత అడపాదడపా కాల్పులు జరగాయన్నారు. ఆర్నియా సెక్టార్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు.

వారు కర్ణాటకకు చెందిన బసవరాజ్, షేర్ సింగ్‌గా గుర్తించారు. గాయపడిన మహిళను అర్నియాలోని 5వ వార్డులో నివాసముంటున్న బల్బీర్ సింగ్ భార్య రజనీ బాలా (38)గా గుర్తించటం జరిగింది.

గాయపడిన వారిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరగడంతో సరిహద్దు వాసులు భయాందోళనకు గురైయ్యారు.