Home   »  నేరాలు   »   Fake RPF SI | తెలంగాణలో RPF మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ పేరుతో మోసం..!

Fake RPF SI | తెలంగాణలో RPF మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ పేరుతో మోసం..!

schedule raju

Fake RPF SI | RPF సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న 25 ఏళ్ల యువతి అరెస్ట్ అయింది. తన ఫేక్ ఐడెంటిటీని ఉపయోగించి, ఆ మహిళ తెలుగు సినిమా నటుడితో సహా కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకున్నట్లు సమాచారం.

malavika arrested for cheating by pretending to be fake RPF SI

తెలంగాణ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తూ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 25 ఏళ్ల మహిళను తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో అరెస్టు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రైల్వే పోలీసులు సమాచారం అందించారు. నిందితురాలిని జడల మాళవికగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు నల్గొండలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి హాజరయ్యిందని, ఆమె తనను తాను సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా చూపించి, నిర్వాహకులచే సన్మానించబడిందని పోలీసులు తెలిపారు.

Fake RPF SI ఐడెంటిటీతో చలామణి

తన ఫేక్ ఐడెంటిటీని ఉపయోగించి, ఆ మహిళ తెలుగు సినిమా నటుడితో సహా మరి కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకున్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (తెలంగాణ స్టేట్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేష్ M. భగవత్ ఒక ప్రకటనలో తెలిపారు. మాళవికపై ఓ RPF సబ్ ఇన్‌స్పెక్టర్ RPS నల్గొండలో ఫిర్యాదు చేశారు. నల్గొండ-సికింద్రాబాద్ మధ్య వివిధ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు మహిళ RPF సబ్-ఇన్‌స్పెక్టర్ యూనిఫాం (Fake RPF SI) ధరించి కనిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫిర్యాదు ఆధారంగా.. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 170 (public servant గా మారువేషంలో తిరగడం), 419 (వంచన ద్వారా మోసం చేయడం) మరియు 420 (మోసం) కింద కేసు నమోదు చేసి, నిందితురాలిని నల్గొండలో అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు మరియు బంధువులకి తను ఇన్‌స్పెక్టర్‌ అని నమ్మించడానికి ఇదంతా చేశానని మహిళ అంగీకరించింది.

దృష్టిలోపం కారణంగా SI కాలేక‌పోయిన మాళవిక

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన మాళవిక అనే యువతి నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆమె RPFS SI పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలను క్లియర్ చేసింది. కానీ వైద్య పరీక్షలో ఆమె దృష్టి లోపం కారణంగా తిరస్కరించబడింది. అయితే అప్పటికే తాను SI అవుతున్నట్లు తల్లిదండ్రులు, బంధువులకు చెప్పింది.

గ్రామంలో తనకున్న పరువు పోతుందని తల్లిదండ్రులను, గ్రామస్తులను సంతృప్తి పరచడం కోసం పోలీస్ అధికారిణిగా తిరగాలని నిర్ణయించుకుని RPFS SI అవతారమెత్తింది. దాదాపు ఏడాది కాలంగా తాను విధులకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నమ్మించింది.

పెళ్లిచూపుల్లో బయటపడ్డ నిజం

మాళవిక ఆలయాలకు వెళ్లడం, ప్రముఖులతో ఫొటోలు దిగడం, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం వంటివి చేసేది. అయితే, కుటుంబ సభ్యులు తనకు పెళ్లి సంబంధం చూడగా అక్కడ కూడా మాళవిక పోలీస్‌ యూనిఫాంలోనే కనిపించింది. అయితే అబ్బాయి తరుపున బంధువులు ఉన్నతాధికారులను సంప్రదించగా యువతి మోసం బయటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో RPF పోలీసులు మాళవికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని SP తెలిపారు.

Also Read: మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం.. రూ.7.85 లక్షల చోరీ