Home   »  తెలంగాణవార్తలు   »   మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న నగరవాసులు.. రద్దీ గణనీయంగా పెరుగుతోంది

మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న నగరవాసులు.. రద్దీ గణనీయంగా పెరుగుతోంది

schedule raju

హైదరాబాద్ మెట్రో రైళ్ల లో రద్దీ గణనీయంగా పెరుగుతోంది. రోడ్డుపై ట్రాఫిక్‌ను నివారించి మెట్రో ప్రయాణాన్ని నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు. 2017 నవంబర్ 29న మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణించారని హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు.రోజుకు వీరి సంఖ్య 4.90 లక్షలు కాగా, అతి త్వరలో 5 లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీంతో మెట్రో కారిడార్లన్నీ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు మార్గంలో నగరం యొక్క ఒక చివర నుండి మరొక చివరకి వెళ్ళడానికి ఒకటిన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది. అదే మెట్రోలో ప్రయాణిస్తే కేవలం 55 నిమిషాల్లో చేరుకోవచ్చు.

వేసవి కాలంతో పాటు తాజా వర్షాకాలంలోనూ ప్రయాణించేందుకు మెట్రో అత్యంత అనుకూలమని నగరవాసులు భావిస్తున్నారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో మెట్రో కారిడార్‌లో కొత్త రిటైల్ వ్యాపారం ఊపందుకుంది. మెట్రో స్టేషన్లలో కొత్త వ్యాపారాలు ఏర్పాటవుతున్నాయి.

ఇప్పటి వరకు దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌లో ఉన్న కేఎఫ్‌సీ కేంద్రాన్ని మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో కూడా ప్రారంభించారు. అదేవిధంగా పంజాగుట్ట మెట్రో స్టేషన్‌లో కాంటినెంటల్ కాఫీ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. అమీర్ పేట, రాయదుర్గం, హైటెక్ సిటీ, KPHB వంటి మెట్రో స్టేషన్లలో ఒక్కొక్కటిగా రిటైలర్లు తమ స్టోర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు చేరువవుతున్నారు.

రిటైల్ షాపుల ద్వారా మెట్రో ఆదాయం

రవాణా ఆధారిత అభివృద్ధి నినాదంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా ఒక్కో మెట్రో స్టేషన్‌లో వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా 10 నుంచి 20 దుకాణాలకు స్థలం కేటాయించారు. మెట్రోలో ప్రయాణిస్తే టికెట్ ద్వారా వచ్చే ఆదాయంతో పాటు స్టేషన్లలోని స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఎక్కువ ఆదాయం సమకూరుతున్నారు. అదేవిధంగా ప్రకటనల ద్వారా మెట్రో సంస్థకు ఆదాయం వస్తోంది.

ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. వీటితో కారిడార్-1లోని LBనగర్ నుంచి మియాపూర్ వరకు 29 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్ల లో రద్దీ నెలకొంది. అదేవిధంగా నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ-రాయదుర్గం వరకు కారిడార్‌-3లో కూడా ట్రాఫిక్‌ గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ రెండు కారిడార్ల పరిధిలోని మెట్రో స్టేషన్లలో కొత్తగా రిటైల్ వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో నగరవాసులు మెట్రో ప్రయాణంపై ఆసక్తి చూపుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు మరియు కాలుష్యం లేకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి.