Home   »  ఆంధ్రప్రదేశ్   »   GPS Bill: జీపీఎస్ బిల్లులో మళ్లీ మార్పులు … క్యాబినెట్ ఆమోదానికి పంపిన Ap ప్రభుత్వం

GPS Bill: జీపీఎస్ బిల్లులో మళ్లీ మార్పులు … క్యాబినెట్ ఆమోదానికి పంపిన Ap ప్రభుత్వం

schedule raju

GPS Bill: గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్లు (GPS Bill)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. లోపాలను సరిదిద్దిన అనంతరం బిల్లును మరోసారి కేబినెట్ ఆమోదానికి పంపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఈ-ఫైల్ ద్వారా మంత్రులకు బిల్లును సర్క్యులేట్ చేసింది. జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్ అప్‌పై అస్పష్టతను తొలగించి ప్రతిపాదనలు చేసింది. కుటుంబ పింఛను, కనీస పింఛను ఎలా ఇవ్వాలో బిల్లులో మార్పులు చేశారు. జీపీఎస్ బిల్లులో తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలను ఆమోదించి పంపాలని మంత్రులను ప్రభుత్వం ఆదేశించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులు జీపీఎస్‌లో కొనసాగేందుకు నిర్ణీత గడువు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ బిల్లు (GPS Bill) ఆమోదం

ఇటీవల సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ (GPS Bill) బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే అందులోని కొన్ని అంశాల్లో మార్పులు చేసి, లోపాలను సరిదిద్దడంతో బిల్లును మరోసారి కేబినెట్ ఆమోదానికి పంపారు. జీపీఎస్ ముసాయిదా బిల్లుకు కేబినెట్‌లో మంత్రులు ఆమోదం తెలిపిన అనంతరం రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్-అప్ కోసం ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను ఈ బిల్లులో ఉంచింది. అలాగే యాన్యుటీ (Annuities) తగ్గితే కుటుంబ పింఛను, కనీస పెన్షన్ ఎలా ఇవ్వాలనే దానిపై బిల్లులో మార్పులు చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్‌కు మారేందుకు కొంత సమయం ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు. ఇటీవల జీపీఎస్‌పై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ రద్దు

ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో సీపీఎస్‌ రద్దు కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌ను అమలు చేశారు. ఈ పథకం ద్వారా పింఛను హామీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే ఉద్యోగి పదవీ విరమణ పొందిన తరువాత ఇల్లు లేని వారికి కచ్చితంగా ఇల్లు ఉండాల్సిందేనని సీఎం జగన్ అన్నారు. అది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. పదవీ విరమణ తర్వాత కూడా, ఉద్యోగులు మరియు వారి పిల్లలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ కి అర్హులయే విధంగా చూసుకోవాలని సూచించారు. తమ పిల్లల చదువులు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద అందేలా చూడాలన్నారు.

ఉద్యోగుల అసంతృప్తి

మరోవైపు జీపీఎస్ బిల్లుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. CPS (కాంట్రిబ్యూటరీ పింఛను పథకం) రద్దు చేసి OPS (పాత పెన్షన్ స్కీమ్) తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ వాదనలు వినకుండా ప్రభుత్వం మొండిగా జీపీఎస్ బిల్లు తెస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు తెలిపిన.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

సీపీఎస్ రద్దు విషయంలో ఇక చేసేదేమీ లేదని సీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. జీపీఎస్ విధానంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. జీపీఎస్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. సీపీఎస్‌ రద్దు చేసిన విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: AP-Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లుల ఆమోదం.!