Home   »  ఆంధ్రప్రదేశ్   »   APలో NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

APలో NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

schedule mounika

చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

చిలకలూరిపేట: చిలకలూరిపేటలో జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అప్పుల ఊబిలో కూరుకుపోయి, అభివృద్ధి లేమితో సతమతమవుతున్న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక పెద్ద ఊరటనిచ్చిందన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్నికల్లో కలిసి పోటీచేయడం పట్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు.

2014లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తమ కూటమి ఏర్పడిందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, ఆ బాలాజీ ఆశీస్సులతో అప్పుడు పొత్తు ప్రకటించామని, ఇప్పుడు మళ్లీ 2024లో కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో మూడు పార్టీలు కలిశాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

NDAకు ప్రజలు మద్దతు ఇవ్వాలి : పవన్ కళ్యాణ్

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, మరోవైపు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ వేధింపులు భరించలేక ఇక్కడి నుంచి పారిపోతున్నాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి శాతం 10.4 శాతం ఉండగా ఇప్పుడు మూడు శాతానికి చేరుకుందని చెప్పారు. తన వద్ద ఉన్న పెద్ద మొత్తం డబ్బుతో ఏదైనా చేయగలనని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారని, అయితే ప్రధాని మోడీ ఇక్కడ ‘రామరాజ్యం’ స్థాపించబోతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. NDAకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

కాగా, టీడీపీ, JSP, బీజేపీ చేతులు కలిపిన తర్వాత నిర్వహించిన ఈ బహిరంగ సభకు భారీ స్పందన లభించింది. మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్ల విరామం తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి బహిరంగ సభకు వచ్చారు. కాగా 2014లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశారు.

ALSO READ: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా విడుదల చేసిన YSRCP