‘పుష్ప 2‘ (Pushpa 2) అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 8న ‘పుష్ప 2’ టీజర్ వస్తుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే, టీజర్ కాదు కానీ ఓ 3 నిమిషాల స్పెషల్ వీడియోను దర్శకుడు సుకుమార్ సిద్ధం చేస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈరోజు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. బన్నీ బర్త్‌డే నాడు కాకుండా ఒక్కరోజు ముందుగానే అంటే ఈనెల 7వ తేదీనే ఆ స్పెషల్ వీడియో రాబోతోంది.
‘పుష్ప ఎక్కడ?’ అంటూ ఈరోజు ఒక 20 సెకెన్ల వీడియో గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ వీడియోలో ‘పుష్ప 2’ స్టోరీ లైన్‌పై ఒక క్లారిటీ ఇచ్చేశారు. ‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ?’ అంటూ టీవీ ఛానెల్స్‌లో వచ్చే కథనాల వాయిస్‌తో ఈ 20 సెకెన్ల గ్లింప్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. పుష్పరాజ్, శ్రీవల్లి పెళ్లితో ‘పుష్ప’ పార్ట్ 1 ముగుస్తుంది. అప్పటికే ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ గుడ్డలూడదీసి అవమానిస్తాడు పుష్ప. బహుశా పెళ్లి తరవాత పుష్పను షెకావత్ అరెస్ట్ చేశాడేమో. జైలుకెళ్లిన పుష్ప రాజ్ తప్పించుకున్నాడు. ఇక అక్కడి నుంచి అజ్ఞాతంలో ఉంటూ ఎర్రచందనం సిండికేట్‌ను నడిపిస్తాడనుకుంటా……..!
ఎందకంటే, ‘పుష్ప’ పార్ట్ 1లో హీరో ఎదుగుదలను చూపించారు. ఇక పార్ట్‌లో హీరో పరిపాలనను చూపించబోతున్నారు. ఈ పరిపాలన మొదలుపెట్టడానికి ముందు పుష్ప వేటను ఈనెల 7వ తేదీన విడుదల చేయబోతున్న స్పెషల్ వీడియోలు చూపించనున్నారు. 7వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు బన్నీ అభిమానులకు పండగ వచ్చేస్తుంది.