Home   »  అంతర్జాతీయం   »   Swara Bhasker: స్వర భాస్కర్ ఎమోషనల్ పోస్ట్.. ఇజ్రాయెల్ యుద్ధంపై తొలిసారి స్పందన

Swara Bhasker: స్వర భాస్కర్ ఎమోషనల్ పోస్ట్.. ఇజ్రాయెల్ యుద్ధంపై తొలిసారి స్పందన

schedule ranjith

స్వర భాస్కర్ (Swara Bhasker) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2012 జీ సినీ అవార్డ్స్, స్క్రీన్ అవార్డ్స్, సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ లాంటి అవార్డులను దక్కించుకుంది.

గాజాలో హాస్పిటల్‌పై బాంబు దాడిలో చిన్నారుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన Swara Bhasker

ఇటివలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి మాతృమూర్తిగా కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker) సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మొదలయ్యాక తొలిసారి ఆమె స్పందించారు. ఇటీవల గాజాలోని ఓ హాస్పిటల్‌పై జరిగిన బాంబు దాడిలో చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు రాబియా ఒడిలో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆమె.. ప్రశాంతంగా నిద్రపోతున్న తన కూతురి ముఖంవైపు చూస్తూ.. ఒకవేళ తాను గాజాలో పుట్టి ఉంటే ఆమెను ఎలా కాపాడుకోగలనని ఆందోళనకు గురయింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు తన కూతురికి ఎప్పటికీ ఎదురుకాకూడదని దేవుడిని కోరుకుంది.

మరణాల నుంచి రక్షించాలని దేవునికి ప్రార్థన

గాజాలో ప్రతినిత్యం మృత్యువాతపడుతున్న పిల్లలు చేసిన పాపం ఏంటి?. తన కూతురిమీద ఉన్న ఆశీర్వచనాలు ఏంటి? అని ఆశ్చర్యపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. ప్రార్థనలు ఆలకించి గాజాలోని పిల్లలను బాధలు, మరణాల నుంచి రక్షించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపింది. ఎందుకంటే ఈ ప్రపంచం వారిని రక్షించలేదని, అందుకే దేవుడిని వేడుకుంటున్నాను అని తెలిపింది.

గాజాలోని చిన్నారులపై దయ చూపాలి

ఏ మాతృమూర్తి అయినా తన నవజాత శిశువుతో గంటల సమయం ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలనుకుంటుందని, ఇందుకు తానేమీ విభిన్నం కాదని అన్నారు. చేతిలో ఉన్న పసిప్రాణం వైపు చూసినప్పుడు తనతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ ఇదే అనుభూతి కలుగుతుందని, కానీ ఇప్పుడు ఎంతమాత్రం విస్మరించలేని భయంకరమైన ఆలోచనల కారణంగా తామంతా గాయపడ్డామని స్వర భాస్కర్ బాధపడుతున్నారు.

Also Read: పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన వైఎస్‌ జగన్‌