Home   »  వార్తలుతెలంగాణరాజకీయం   »   బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. ధర్నాలు, దీక్షలతో దద్దరిల్లిన తెలంగాణ..

బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. ధర్నాలు, దీక్షలతో దద్దరిల్లిన తెలంగాణ..

schedule yuvaraju

తెలంగాణ: రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. కూల్‌ వెదర్‌లో సైతం మంటలు పుట్టిస్తున్నారు నేతలు. ఎన్నికలవేళ ప్రతి చిన్న ఛాన్స్‌ను వినియోగించుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి ఫ్రీ పవర్‌ కామెంట్స్‌ను అస్త్రంగా మార్చుకొని ధర్నాలతో హోరెత్తించింది బీఆర్‌ఎస్‌. ఇదీ కాంగ్రెస్‌ నైజం అంటూ రైతులందర్నీ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇక కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌కి కౌంటర్‌గా నిరసనలతో హీట్‌ పుట్టించింది. ఇలా ధర్నాలు, దీక్షలతో దద్దరిల్లిపోయింది తెలంగాణ. ఒకవైపు బీఆర్‌ఎస్‌, ఇంకోవైపు కాంగ్రెస్‌ పోటాపోటీగా ఆందోళనలు చేశాయ్‌. ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ వ్యాఖ్యల్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాలు చేస్తే కౌంటర్‌గా విద్యుత్‌ సబ్‌స్టేషన్ల దగ్గర ఆందోళనలు నిర్వహించింది కాంగ్రెస్‌. రెండు పార్టీలు కూడా నిరసనలతో హోరెత్తించాయి. కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ్‌!

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ ఇలా ప్రతి జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు . కాంగ్రెస్‌కి, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్‌ దిష్టిబొమ్మలు దగ్ధంచేసి నిరసన తెలిపారు. ఇక రేవంత్‌ పేరు చెబితేనే ఒంటికాలిపై లేచే మంత్రి మల్లారెడ్డి, తనదైన స్టైల్లో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌కి పవర్‌ ఇస్తే రైతులకు పవర్‌ కట్‌ అవుతుందంటూ సెటైర్లు వేశారు.

హైదరాబాద్‌ విద్యుత్‌సౌధ ముందు ధర్నాచేసిన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రైతాంగం సంతోషంగా ఉండటం రేవంత్‌కి ఇష్టంలేదన్నారు. అందుకే తన మనసులో ఉన్న కుట్రను బయటపెట్టారన్నారు కవిత.