Home   »  వార్తలు   »   తెలంగాణ: పరకాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్.

తెలంగాణ: పరకాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్.

schedule chiranjeevi

హన్మకొండ: పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 100 పడకల ఆసుపత్రిని ఆమె పరిశీలించిన సందర్భంగా ఆగస్టులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

పరకాలలో రూ.35 కోట్లతో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీలో కోటి రూపాయలతో చేపడుతున్న ‘వైకుంట ధామం’ పనులను ఆమె పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మంజూరైన నిధులతో పనులు పూర్తి కాకపోవడంతో అదనంగా రూ.60 లక్షలు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.

అనంతరం ఆర్డీఓ కార్యాలయం (రూ. 2.80 కోట్లు), తహశీల్దార్‌ కార్యాలయం (రూ. 2.1 కోట్లు) నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌ నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 4.50 కోట్లతో మంజూరైన ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ మీట్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అదనంగా మూడు నిధులు మంజూరు చేసి మిగిలిన 10 శాతం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే మున్సిపల్ భవన నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన జంక్షన్‌ అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోరారు.

మున్సిపల్ చైర్ పర్సన్ సోడా అనితా రామకృష్ణ, ఆర్డీఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషు, తహశీదార్ జగన్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.