Home   »  వార్తలు   »   తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్ ఇచ్చింది: CS శాంతి కుమారి కీలక ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్ ఇచ్చింది: CS శాంతి కుమారి కీలక ఉత్తర్వులు

schedule chiranjeevi

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వారి జాబితాను పంపాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. అలాగే విధులకు హాజరుకాని వారి స్థానాల్లో తాత్కాలిక కార్యదర్శులుగా కొత్త వారిని నియమించాలని ఆదేశించారు. గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష రాసిన వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంచాయతీరాజ్‌ జూనియర్‌ కార్యదర్శులను తొలగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుందని సీఎస్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా పంచాయతీ అధికారులతో సీఎస్‌ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఉద్యోగంలో చేరాలని ప్రభుత్వం గడువు విధించింది. అంతేకాదు పనికి రాని పక్షంలో వారిని ఉద్యోగులుగా పరిగణించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం విధుల్లో ఉన్న వారి జాబితాను మధ్యాహ్నం లోపు పంపాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ తో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో వినూత్న నిరసన చేపట్టాలని కొత్తగూడెం జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిర్ణయించారు. ఈ మేరకు గోదావరి నదిలో జలదీక్ష చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.