Home   »  జాతీయంవార్తలు   »   12 మంది మిలిటెంట్ల ను విడుదల చేసేందుకు మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టారు.

12 మంది మిలిటెంట్ల ను విడుదల చేసేందుకు మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టారు.

schedule raju

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటీవల భారత సైన్యం అదుపులోకి తీసుకున్న పలువురు మిలిటెంట్ల ను విడిపించేందుకు ఏకంగా 1500 మంది వరకు మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టడం గమనార్హం. పౌరుల భద్రత కోసం మానవతా దృక్పథంతో వారిని విడుదల చేసినట్లు ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

నిఘా వర్గాల సమాచారంతో శనివారం గ్రామంలో సైన్యం ఆపరేషన్ ప్రారంభించింది. తనిఖీల్లో భాగంగా మైటీ మిలిటెంట్ల గ్రూప్ ‘KYKL’కు చెందిన 12 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. 2015లో ‘6 డోగ్రా యూనిట్’పై జరిగిన ఆకస్మిక దాడితో సహా పలు ఘటనల్లో ఈ బృందం ప్రమేయం ఉందని సైన్యం తెలిపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

దాదాపు 1200 నుంచి 1500 మంది మహిళలు సైన్యాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. రోజంతా ఇరువర్గాల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు సైన్యం వారిని విడిచిపెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ తెలిపింది. అయితే స్వాధీనం చేసుకున్న ఆయుధాలను తరలించినట్లు తెలిపారు.