Home   »  వార్తలు   »   యాదగిరి మళ్లీ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు

యాదగిరి మళ్లీ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు

schedule chiranjeevi

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా ఆచార్య యాదగిరి సోమవారం పునఃప్రారంభించారు. పాలకమండలి సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్‌, ఆచార్య నసీమ్‌, ఆరతి, రవీందర్‌ ఆయనను పిలిచి రిజిస్ట్రార్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్ సోమవారం యూనివర్సిటీకి రాలేదు. శనివారం వరకు రిజిస్ట్రార్‌గా కొనసాగిన ఆచార్య నిర్మలాదేవి అనూహ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి తిరిగి వచ్చి అక్కడ విధుల్లో చేరారు. నిర్మలాదేవిని రిజిస్ట్రార్‌గా వైస్‌ ఛాన్సలర్‌ రవీందర్‌ నియమించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను రిజిస్ట్రార్‌ కుర్చీపై కూర్చున్నానని యాదగిరి విలేకరులతో అన్నారు. పాలకమండలి నియమించినందున ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదన్నారు. వేతనాల కోసం పొరుగుసేవల ఉద్యోగులు సోమవారం యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. వైస్ ఛాన్సలర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పాలకమండలి సభ్యులు ఎస్ బీఐ శాఖ మేనేజర్ రవికుమార్ ను పిలిపించి యూనివర్సిటీ చట్టంలోని అంశాలను పాలకమండలి తీసుకున్న తీర్మానాలను వారికి చూపించారు. ఉద్యోగుల జీతాల చెక్కులను అనుమతించాలని చెప్పారు. బ్యాంకు మేనేజర్ స్పందిస్తూ.. రిజిస్ట్రార్ నియామకానికి సంబంధించి వివాదం ఉన్నందున ఉన్నతాధికారులు న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.