Home   »  క్రీడలు   »   తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌… ఆసీస్-ఇండియా T20 వేదిక మార్పు

తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌… ఆసీస్-ఇండియా T20 వేదిక మార్పు

schedule mahesh

IND vs AUS: ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్‌ ఆడే ఏ ఒక్క మ్యాచ్‌ కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఆడే అవకాశం దక్కక పోగా, అంతలోనే రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు మరో చేదు వార్త వినాల్సివచ్చింది.

IND vs AUS మ్యాచ్‌ను హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు తరలింపు

ప్రపంచకప్‌ ముగిశాక భారత్‌ – ఆస్ట్రేలియా(IND vs AUS) మధ్య డిసెంబర్‌ 03న ఉప్పల్‌ వేదికగా జరుగబోయే ఐదో టీ20ని అయినా చూసి ఆనందిద్దామనుకున్న అభిమానులకు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. సరిగ్గా అదే రోజు (డిసెంబర్‌ 3) తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు తరలించినట్టు తెలిసింది.

మ్యాచ్‌కు భద్రత కల్పించలేమన్న తెలంగాణ పోలీసులు

సరిగ్గా అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, ఉప్పల్‌ వేదికగా జరుగబోయే మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA)కు వెల్లడించారు.

ఇదే విషయాన్ని హెచ్‌సీఏ BCCI దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 23న విశాఖపట్నంలో జరిగే తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌కు తరలించి ఐదో మ్యాచ్‌ను వైజాగ్‌కు తరలించాలని కోరినా బీసీసీఐ దానిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది.

నాలుగో మ్యాచ్‌ నాగ్‌పూర్‌ నుండి రాయ్‌పూర్‌కు మార్చిన బీసీసీఐ

హైదరాబాద్‌ టీ20ని బెంగళూరుకు మార్చిన బీసీసీఐ నాలుగో టీ20 వేదికను కూడా మార్చినట్టు తెలుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం నాలుగో మ్యాచ్‌ నాగ్‌పూర్‌లో జరగాల్సి ఉండగా పలు కారణాల రీత్యా దానిని రాయ్‌పూర్‌కు మార్చినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీనిపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) దీని మీద అధికారిక ప్రకటన చేయాల్సి వుంది.