Home   »  క్రీడలు   »   నేటి నుంచి భారత్‌ – ఇంగ్లండ్‌ రెండో టెస్టు మ్యాచ్

నేటి నుంచి భారత్‌ – ఇంగ్లండ్‌ రెండో టెస్టు మ్యాచ్

schedule mahesh

India-England second test | స్వదేశంలో జరుగుతున్న సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా దంచి కొడుతుందనుకుంటే చివరి నిమిషంలో చేతులెత్తేసింది. ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్‌తో ఎదురుదాడి చేసి శుభారంభం చేసింది. ఉప్పల్ లో సత్తా చాటలేకపోయిన రోహిత్ సేన విశాఖలో ఇంగ్లిష్ టీమ్ కు బ్రేక్ లు వేసేందుకు సిద్ధమైంది.

india-england-second-test-match-from-today

India-England second test | సుదీర్ఘ ఫార్మాట్‌లో దూసుకెళ్తున్న ఇంగ్లండ్ జట్టు అదే “బజ్‌బాల్” ఆటతీరుతో ఉప్పల్‌లో టీమిండియాను చిత్తు చేసింది. తొలి రెండు రోజులు కనీసం పోటీలో లేని పర్యాటక జట్టు ఆ తర్వాత అసమాన పోరాటంతో మ్యాచ్‌ను విజయంతో ముగించింది. ఇప్పుడు ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని టీమ్‌ఇండియా కాచుకొని ఉంటే, అదే జోరులో సిరీస్‌పై మరింత పట్టు సాధించాలని స్టోక్స్‌ సేన భావిస్తోంది.

నేటి నుంచి India-England second test

ఈ నేపథ్యంలో భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుండి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభం కాబోతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోగా, గత మ్యాచ్‌లో రాణించిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం జరిగింది. దీంతో తుది జట్టును ఎంపిక చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు సవాలుగా మారింది. మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌తో పాటు మిడిలార్డర్‌లో రజత్‌ పాటిదార్‌ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఉదయం 9.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం

దేశవాళీల్లో పరుగుల వరద పారించి భారత జట్టుకు ఎంపికైన సర్ఫరాజ్‌ ఖాన్‌ తుది జట్టులో చోటుకోసం మరింత కాలం వేచి చూడాల్సి వుంది. తొలి టెస్టులో స్వీప్‌ షాట్లతో భారత స్పిన్‌ యంత్రాన్ని ఛేదించిన ఇంగ్లండ్‌ జట్టు వైజాగ్‌లోనూ అదే అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తుంది. భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం దానికి తమ దగ్గర విరుగుడు ఉందని ధీమాగా వున్నాడు. ఇంగ్లండ్‌ జట్టు చివరిసారిగా భారత పర్యటనకు వచ్చిన సమయంలోనూ చెన్నైలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించింది. ఆ తర్వాత మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది.

ఇప్పుడు కూడా అదే ఫలితం రావాలని అభిమానులు ఆశిస్తుంటే, దూకుడే మంత్రంగా దూసుకెళ్తున్న స్టోక్స్‌ సేన భారత్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తుంది. మరోవైపు ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ స్థానంలో సూపర్‌ సీనియర్‌ అండర్సన్‌, లీచ్‌ ప్లేస్‌లో బషీర్‌ తుది జట్టులో చోటు దక్కించుకొన్నారు.

భారత్‌ తుది జట్టు అంచనా | రోహిత్‌ (కెప్టెన్‌), యశస్వి, గిల్‌, శ్రేయస్‌, రజత్‌ పాటిదార్‌, అక్షర్‌, భరత్‌, అశ్విన్‌, కుల్దీప్‌, బుమ్రా, సిరాజ్‌.
ఇంగ్లండ్‌ తుది జట్టు అంచనా | స్టోక్స్‌ (కెప్టెన్‌), క్రాలీ, డకెట్‌, పోప్‌, రూట్‌, బెయిర్‌స్టో, ఫోక్స్‌, రెహాన్‌, హార్ట్లీ, బషీర్‌, అండర్సన్‌.

Also Read | ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న అశ్విన్‌