Home   »  క్రీడలు   »   భారత్ కోచ్ గా ముగిసిన రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టు… ద్రవిడ్ భవితవ్యమేంటి..!

భారత్ కోచ్ గా ముగిసిన రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టు… ద్రవిడ్ భవితవ్యమేంటి..!

schedule mahesh

న్యూఢిల్లీ: ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో భారత జట్టు 2023 ప్రపంచ కప్ ప్రయాణాన్ని రన్నరప్‌తో ముగించింది. దానితో పాటు భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) రెండేళ్ల కాంట్రాక్ట్ కూడా అధికారికంగా పూర్తి అయ్యింది.

Rahul Dravid

మూడు ICC టోర్నీలలో భారత్‌ను నాకౌట్‌కు చేర్చిన కోచ్ Rahul Dravid

కోచ్ ద్రవిడ్ నవంబర్, 2021లో భారత క్రికెట్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. మరియు జట్టును 2022 T20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరియు 2023 ప్రపంచ కప్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

మూడు ఐసీసీ టోర్నీలలో భారత్‌ను నాకౌట్‌ దశకు చేర్చినా కప్పు మాత్రం అందించడంలో విజయం సాదించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మరి ద్రవిడ్ భవితవ్యం ఏంటి, మిస్టర్‌ వాల్‌ను కోనసాగిస్తారా, తొలగిస్తారా, ఒకవేళ దించితే ఇప్పటికిప్పుడు భారత జట్టుకు మార్గదర్శకత్వం చేసే కోచ్‌ ఎవరు అన్నది సందేహంగా మారింది.

భారత్ కు అందని ద్రాక్షల మారిన ICC ట్రోఫీలు

2021లో విరాట్‌ కోహ్లీ , రవిశాస్త్రిల ధ్వయం దాదాపు ఒకేసారి కెప్టెన్‌, కోచ్‌ బాధ్యతల నుండి తప్పుకున్నాక ఆ బాధ్యతలను బీసీసీఐ రోహిత్ – ద్రవిడ్‌ల (Rahul Dravid)కు అప్పగించింది. మిస్టర్‌ కూల్‌గా పేరున్న ఈ జోడీ టీమిండియా కు సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షలా మిగిలిన ఐసీసీ టోర్నీలలో భారత్‌ను విజయతీరాలకు చేర్చుతారని BCCIతో పాటు అభిమానులూ ఆశపడ్డారు.

రోహిత్ – ద్రవిడ్‌ల (Rahul Dravid) ధ్వయం తొలిసారి 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఈ టోర్నీలో భారత్‌ జట్టు సెమీస్‌లోనే ఇంటి దారి పట్టింది. ఇక ఈ ఏడాది ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ (WTC ఫైనల్‌)లో కూడా తుది మెట్టుకు చేరుకున్న అక్కడ కూడా కప్పు కొట్టలేకపోయింది. అయితే ఇవి రెండు ఓడిపోయిన ఈ సారి స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ అయినా సాధిస్తారని భావించిన అభిమానులకి మళ్లీ నిరాశే ఎదురైంది.

కోచ్ గా ముగిసిన రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టు

ప్రపంచకప్ ఫైనల్‌ ముగిసిన తర్వాత ద్రవిడ్‌ ఇదే విషయమై మాట్లాడుతూ కోచ్ గా తప్పుకునే విషయంపై… ప్రస్తుతం తానైతే దాని గురించి ఆలోచించడం లేదని, త్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ద్రవిడ్ తెలిపాడు. ప్రస్తుతానికి తన ఆలోచనలన్నీ ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లమీదే ఉన్నాయని, అంతకుమించి తాను మరేమీ ఆలోచించడం లేదని వెల్లడించాడు.

ద్రవిడ్‌ వెర్షన్‌ ఇలా ఉంటే బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తుంది. ద్రవిడ్‌ మీద గంపెడాశలు పెట్టుకున్న బీసీసీఐ అతడు కూడా భారత కలను నిజం చేయలేకపోవడం పై ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలని సమాలోచనలు చేస్తుంది.

చివరిసారిగా 2013లో ICC ట్రోఫీ గెలిచిన భారత్

భారత జట్టు చివరిసారి కోచ్ డంకెన్‌ ఫ్లెచర్‌ ఆధ్వర్యంలో ఐసీసీ ట్రోఫీ 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుపొందింది. ఆ తర్వాత టీమిండియా 2014 నుంచి సరిగా ఒక్క ఐసీసీ టోర్నీ ని కూడా గెలవలేకపోయింది. ఫ్లెచర్‌ తర్వాత ఇప్పటి వరకు భారత్ జట్టుకు ఏ విదేశీ కోచ్‌ పని చేయలేదు.

ద్రవిడ్‌ నేతృత్వంలో మూడు ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్

అయితే ఇప్పటి వరకు భారత జట్టు ఐసీసీ నాకౌట్‌ దశలో ఓడటం తప్పితే భారత జట్టు ప్రదర్శన బాగోలేదనడానికి కూడా లేదు. అయితే కోచ్ ద్రవిడ్‌ నేతృత్వంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌గా నిలవడం జరిగింది. మరి ద్రవిడ్‌ ను కొనసాగిస్తారా లేక విదేశీ కోచ్‌కు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాలి.