Home   »  క్రీడలు   »   నేడే భారత్ – కివీస్ సెమిస్ పోరు…ఫైనల్ కి చేరేదెవరు..!

నేడే భారత్ – కివీస్ సెమిస్ పోరు…ఫైనల్ కి చేరేదెవరు..!

schedule mahesh

ముంబై: వన్డే వరల్డ్ కప్ లో అసలు సిసలైన సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచకప్ లో ఇన్ని రోజులు లీగ్‌ దశ మ్యాచ్‌లు అభిమానులకు ఆనందాన్ని పంచాయి. నేటి నుండి జరిగే నాకౌట్‌ పోరు మెగాటోర్నీని మరో దశకు తీసుకెళ్లనుంది. చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం భారత్‌, న్యూజిలాండ్‌(India – New Zealand) జట్ల మధ్య కీలకమైన సెమీఫైనల్‌ పోరు జరగబోతుంది.

లీగ్‌ స్టేజ్ లో కివీస్‌ను చిత్తుచేసిన భారత్

లీగ్‌ స్టేజ్ లో కివీస్‌ను చిత్తుచేసిన భారత్ జట్టు (India – New Zealand) అదే ఆత్మవిశ్వాసంతో సెమిస్ పోరులో మరోసారి కివీస్ ను ఓడించి ఫైనల్‌ కు దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తుంది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో రోహిత్‌సేన అజేయంగా నిలువగా, కివీస్‌ ఐదు విజయాలు, నాలుగు ఓటములతో నాలుగో స్థానంతో సెమీఫైనల్‌కు చేరుకుంది. ప్రస్తుత టోర్నీతో కలిపి ఇప్పటి వరకు టీమ్‌ఇండియా ఎనిమిది సార్లు సెమీఫైనల్‌కు చేరుకుంది.

ఇందులో రెండుసార్లు(1983, 2011) ట్రోఫీని సాధించింది. స్వదేశంలో చివరిసారి జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలో టీమిండియా ట్రోఫీని గెలుచుకుంది. అయితే నాలుగేండ్ల క్రితం మాంచెస్టర్‌లో జరిగిన మెగాటోర్నీ సెమీస్‌లో కివీస్‌ టీమ్‌ఇండియాను ఓడించింది.

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న India – New Zealand మ్యాచ్

ఇప్పుడు అదే కివీస్‌ జట్టు మళ్లీ సెమీస్‌లో భారత జట్టుతో తలపడబోతుంది. ఇప్పుడు మన ముంబైలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించే అవకాశం భారత జట్టుకు లభించింది. మెగాటోర్నీలో ఇప్పుడున్న జోరును టీమ్‌ఇండియా కొనసాగిస్తే మనల్ని అడ్డుకోవడం ఏ జట్టుకైనా అసాధ్యంగా కనిపిస్తుంది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో మనోళ్లు దుమ్మురేపుతున్న వైనం ముచ్చటగా మూడోసారి కప్‌ను అందుకునేలా కనిపిస్తుంది.

మెగాటోర్నీలో 594 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్న విరాట్‌ కోహ్లీ

మెగాటోర్నీలో 594 పరుగులతో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అందరి కంటే టాప్‌లో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ(503) పరుగులతో జోరు మీద ఉన్నాడు. వీరిద్దరిలో ఏ ఒక్కరూ కుదురుకున్నా కివీస్‌ పని అయిపోయినట్లే, బౌలింగ్‌ విషయానికొస్తే లేట్‌గా వచ్చినా షమీ స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

షమీకి తోడు సిరాజ్‌, బుమ్రా చెలరేగితే కివీస్‌ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు. మరోవైపు జడేజా, కుల్దీప్‌యాదవ్‌లు తమ స్పిన్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మొత్తంగా మరోసారి సమిష్టి ప్రదర్శన కనబరిస్తే టీమ్‌ఇండియా ఫైనల్ కు చేరడం పెద్ద కష్టమేమి కాదు.

భారత జట్టు అంచనా

భారత్‌: రోహిత్‌శర్మ(కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, అయ్యర్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, షమీ, కుల్దీప్‌యాదవ్‌, బుమ్రా, సిరాజ్‌.

న్యూజిలాండ్‌ జట్టు అంచనా

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌(కెప్టెన్‌), కాన్వె, రచిన్‌, మిచెల్‌, లాథమ్‌, ఫిలిప్స్‌, చాప్‌మన్‌, సాంట్నర్‌, సౌథీ, ఫెర్గుసన్‌, బౌల్ట్‌.