Home   »  టెక్నాలజీ   »   స్టాక్‌ మార్కెట్‌ సేవలకు ఫోన్‌-పే కొత్త యాప్‌

స్టాక్‌ మార్కెట్‌ సేవలకు ఫోన్‌-పే కొత్త యాప్‌

schedule raju

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ ఫోన్‌-పే స్టాక్‌ మార్కెట్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. UPI లావాదేవీలకే పరిమితమైన ఈ సంస్థ ఇకపై స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు సేవలను అందించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. షేర్‌.మార్కెట్‌ (Share.Market) పేరుతో కొత్త యాప్‌ను ప్రారంభించింది. స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌తో పాటూ ఈటీఎఫ్‌లు (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెట్‌ ఫండ్స్‌) లాంటి సేవలను అందించనుంది.

ఇప్పటికే బీమా పాలసీలను అందించటంతో పాటూ మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ పెట్టుబడి పెట్టేందుకు ఫోన్‌-పే యాప్‌ వినియోగదారులకు సహకరించనుంది. నాలుగేళ్ల క్రితమే మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో అడుగుపెట్టామని చెప్పిన ఫోన్‌-పే సీఈఓ సమీర్ నిగమ్ ఇటీవలే రుణాలు, బీమా, చెల్లింపులను తీసుకొచ్చామని వెల్లడించారు. అయితే తాజాగా స్టాక్‌ బ్రోకరేజ్‌ వ్యాపారంలోనూ తాము అడుగుపెట్టామని సమీర్‌ నిగమ్‌ స్పష్టం చేశారు.

మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించిందని.. అందుకే వెంటనే యాప్ తీసుకొచ్చినట్లు పేర్కొంది ఫోన్‌పే. స్టాక్ బ్రోకింగ్ బిజినెస్‌లో ప్రస్తుతం జెరోధా, గ్రో, అప్‌స్టాక్స్ వంటి కంపెనీల డామినేషన్ కొనసాగుతోంది. ఫోన్‌పే 100 మిలియన్ డాలర్లను సమీకరించిన 5 నెలల తర్వాత ఇప్పుడు కంపెనీ స్టాక్ బ్రోకింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. జనరల్ అథ్లెటిక్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఈ మేరకు నిధులను సమీకరించింది. అంతేకాకుండా ఈ కంపెనీ ఇప్పటికే రిబిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి 100 మిలియన్ డాలర్లు సమీకరించింది.