Home   »  తెలంగాణ   »   కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన CM KCR..

కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన CM KCR..

schedule mounika

హైదరాబాద్‌: మెదక్‌ M.P, దుబ్బాక అసెంబ్లీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి(Prabhakar Reddy)కి సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో దాదాపు నాలుగు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy)కి మెరుగైన వైద్యం అందించాలి :KCR

దుబ్బాక నియోజకవర్గంలో ఈ రోజు హత్యా యత్నానికి (తీవ్ర కత్తి పోటుకు) గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావును సీఎం ఆదేశించారు.

ఊహించిన దానికంటే క్లిష్టంగా మారిన శస్త్రచికిత్స సమయంలో, ప్రభాకర్ రెడ్డి పొత్తికడుపులో కత్తి గాయాలు కనీసం నాలుగు ఉన్నందున, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ల బృందం చిన్న ప్రేగులోని కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చిందని, చిన్నప్రేగులో కొంత భాగాన్ని తొలగించడం వల్ల ఎలాంటి ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌లు రాకుండా ఉండేందుకు ప్రభాకర్‌రెడ్డిని కనీసం వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి అబ్జర్వేషన్‌లో ఉంచుతామని ఆస్పత్రి వైద్యులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన C.M కెసిఆర్

అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హత్యాయత్నం సంఘటన దురదృష్ట కరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.

కాగా, హాస్పిటల్ కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు కూడా ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, M.P పోతుగంటి రాములు, M.L.C మధుసూదనాచారి తదితరులు ఉన్నారు.