Home   »  తెలంగాణ   »   తెలంగాణాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

schedule raju

Elevated Corridors | రక్షణ శాఖ భూముల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి కరీనంగర్, హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ మార్గాల్లో జేబీఎస్ నుంచి శామీర్ పేట, మేడ్చల్ వరకు 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రక్షణ శాఖ భూములు అప్పగించాలని కోరారు.

construction of Elevated Corridors in Telangana

హైదరాబాద్: డిఫెన్స్ భూములను కేటాయిస్తూ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణంతో హైదరాబాద్‌ నుంచి శామీర్‌పేట, హైదరాబాద్‌ నుంచి మేడ్చల్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇది ఉత్తర తెలంగాణ వైపు రవాణా మార్గాల అభివృద్ధిని కూడా సూచిస్తుంది.

డిఫెన్స్ భూముల్లో Elevated Corridors

డిఫెన్స్ భూముల్లో ఎలివేటెడ్ కారిడార్ల అభివృద్ధికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 5న ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. CM విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడే కారిడార్ల నిర్మాణానికి అనుమతించినందుకు ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు CM కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ నుంచి కరీంనగర్-రామగుండం వరకు రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ (Elevated Corridors) నిర్మాణానికి, మొత్తం 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి 83 ఎకరాలు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

18.30 కి.మీ పొడవులో కారిడార్ల నిర్మాణం

కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుండి నాగ్‌పూర్ హైవే (NH-44)పై ORR వరకు ప్రతిపాదించిన మొత్తం 18.30 కి.మీ పొడవులో కారిడార్ల నిర్మాణానికి 56 ఎకరాల రక్షణ శాఖ ఆధీనంలోని భూమిని బదిలీ చేయడానికి కూడా రక్షణ మంత్రి అంగీకరించారు. అందులో 12.68 కి.మీ. ఆరు-లైన్ల ఎలివేటెడ్ కారిడార్, నాలుగు ప్రాంతాలలో ప్రవేశాలు మరియు భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్ నిర్మించనున్నారు.

జాతీయ రహదారుల విస్తరణ

కేంద్రం ఇచ్చిన అనుమతితో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, రామగుండం జిల్లాల్లో రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. సికింద్రాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారమవుతుంది. హైదరాబాద్ నుండి శామీర్‌పేట వరకు మరియు హైదరాబాద్ నుండి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్‌ల అభివృద్ధి హైదరాబాద్ నగరం యొక్క ఉత్తరం వైపు వేగవంతమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

రక్షణ శాఖ భూములు మంజూరు చేయడంతో జాతీయ రహదారుల విస్తరణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని అధికారులు తెలిపారు. తాను ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేశానని ఈ సందర్భరంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమన్నారు.

Also Read: తెలంగాణలో త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ల ఏర్పాటు..!