Home   »  తెలంగాణ   »   Narayanpet District | హోలీ వేడుకల్లో ఓ బాలిక మృతి..!

Narayanpet District | హోలీ వేడుకల్లో ఓ బాలిక మృతి..!

schedule raju

Narayanpet District | రంగుల పండుగ హోలీ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని గోపాల్‌పేట వీధిలో మినీ వాటర్‌ట్యాంకు కూలిపోవడంతో ఒక బాలిక మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ మినీ వాటర్‌ట్యాంక్ దాదాపు పదేళ్ల కిందట నిర్మించారు. ట్యాంకు పక్కనే ఆదివారం రాత్రి పెద్దఎత్తున కాముడి దహనం వేడుక నిర్వహించడంతో మరింత దెబ్బతిని కూలిపోయింది.

girl died during Holi celebrations in Narayanpet District

నారాయణపేట జిల్లాలో హోలీ వేడుకల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం జరిగిన సంఘటనలో 13 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నారాయణపేట జిల్లా (Narayanpet District) కేంద్రంలోని గోపాల్‌పేట వీధిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. గోపాల్‌పేట వీధిలో తెల్లవారుజామున వాటర్‌ట్యాంకు కూలిపోవడంతో రమేష్‌యాదవ్‌ – లక్ష్మి దంపతుల కూతురు లక్ష్మీప్రణిత (13) విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. స్థానిక ప్రైవేటు స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న లక్ష్మీప్రణిత సోమవారం తన మిత్రులతో కలిసి హోలీ ఆడేందుకు వెళ్లింది.

స్నేహితులతో హోలీ ఆడుతూ సరదాగా గడిపిన చిన్నారి, అనంతరం కాలనీలో ఉన్న మినీ వాటర్‌ట్యాంకు వద్ద రంగులను శుభ్రం చేసుకుంటుండగా ఒక్కసారిగా కూలిపోయింది. నిన్న రాత్రి ‘కామదహనం’ క్రతువులో తీవ్రమైన వేడి కారణంగా మినీ వాటర్‌ట్యాంకు వేడెక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

దింతో లక్ష్మీప్రణిత మరణించగా పక్కనే ఉన్న హరిప్రియ అనే బాలికకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. మరో బాలిక నిహారికకు స్వల్పగాయాలు కాగా స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై నారాయణపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Reda: ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు