Home   »  తెలంగాణ   »   Pravalika |ప్రవళిక మృతిపై స్పందించిన తెలంగాణ గవర్నర్..

Pravalika |ప్రవళిక మృతిపై స్పందించిన తెలంగాణ గవర్నర్..

schedule mounika

గ్రూప్ 2 విద్యార్థిని ప్రవళిక (Pravalika)ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని, విద్యార్థులు సహనం కోల్పోవద్దని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, టీఎస్‌పీఎస్సీలను ఆదేశించారు.

ప్రవళిక బంధువులకు గవర్నర్ తన సానుభూతిని తెలియజేశారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కోచింగ్‌లో ఉన్న ప్రవళిక శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు రోడ్లపైకి రావడంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, ప్రవళిక అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన వరంగల్‌లో ప్రారంభమయ్యాయి. అంత్యక్రియలకు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలను పోలీసులు అనుమతించలేదు. నిరసనల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది మరియు ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.

ప్రవళిక( Pravalika)మృతిపై స్పందించిన రేవంత్ రెడ్డి..

ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన దానివి.. మరికొంత ఆత్మస్థైర్యాన్ని కూడదీసుకోలేకపోయావా? నువ్వు కన్న కలల కోసం మరికొన్నాళ్లు వేచి ఉండలేకపోయావా? నిన్ను కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాలన్న సంగతిని మరిచిపోయావా? ఎంతోమందికి దారి చూపాలనుకున్నదానివి.. ఇలా అర్ధాంతరంగా నీ ప్రయాణం ముగిస్తావా? భగవంతుడు నీ ఆత్మకు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తూన్నను.

ఆత్మహత్యలు వద్దు.. మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు : రేవంత్ రెడ్డి

యువతీ, యువకుల్లారా! ఆత్మహత్యలు వద్దు.. మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు! మన భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ఈ నక్కలు ఎక్కడ నక్కినా గుంజుకొచ్చి దోషులుగా నిలబెడదాం. వీళ్ళ నక్క జిత్తులను నడి రోడ్డులో నిలబెట్టి తరిమికొడదాం అని రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు.

ప్రవళిక (Pravalika)మృతిపై స్పందించిన బండి సంజయ్..

అరాచక పాలనలో మరో ఆడబిడ్డ ఆయువు తీసుకోవడం గుండెలు పిండేస్తోంది. కానీ, నిరుద్యోగ యువతా….! ఆత్మహత్యలు వద్దు. ఆశ, ఆశయం, ఉరకలెత్తెన ఉత్సాహం, ఉరిమి తరిమిన మీ పౌరుషంతోనే తెలంగాణ సాకారం అయింది. అమరుల ఆకాంక్షల సారథులైన మీరు, ఒక్క కుటుంబం నిరంకుశత్వానికి నిరాశపడితే ఆత్మబలిదానాలు చేసిన అమరులను అవమానించడమే. నోటిఫికేషన్లు రాక, వచ్చినా వాయిదాలు పడుతూ, పేపర్‌ లీకులు, కోర్టు కేసులతో మీలో నిరాశ నిండుకుంటోందని తెలుసు.

ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదాం: బండి సంజయ్..

కానీ, ఆ నిరాశ మీ సత్తువను కమ్మేయకూడదు. నిరంకుశత్వాన్ని నిగ్గుతేల్చే నిప్పు కణికలా ఎగిసిపడాలి. బిజెపి మీ వెంటే ఉంటుంది. మీకోసం పోరాడుతుంది. మంచి రోజులు మన ముందే ఉన్నాయి. దొరల అరాచక పాలనను గద్దెదించి సత్తా చాటుదాం. మరొక్కసారి బరువైన గుండెతో కోరుతున్నా,ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదాం అని బండి సంజయ్ ట్విటర్ వేదికగా తెలిపారు..

ప్రవళిక మృతిపై స్పందించిన వైస్ షర్మిల..

ఉద్యోగాలు లేక ప్రవళిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరనానికి పాల్పడుతుంటే.. కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ ? ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ విగతజీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా మీకు అని ప్రశ్నించారు.

ప్రవళికది ఆత్మహత్య కాదు.. మీ సర్కార్ చేసిన హత్య : వైస్ షర్మిల.

ప్రవళికది ఆత్మహత్య కాదు.. మీ సర్కార్ చేసిన హత్య. నష్ట జాతకురాలు ప్రవళిక కాదు.. అన్ని అధికారాలున్నా నిరుద్యోగుల కోసం ఏం చేయలేని పాలకులు నష్ట జాతకులు. ఉద్యోగాలకు సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాలేదన్నారు. ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించడం చేతకాలేదు. ఏం చూసి మిమ్మల్ని మళ్లీ ఎన్నుకోవాలి? ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసినందుకా.. నిరుద్యోగ భృతి అని దొంగ హామీ ఇచ్చినందుకా.. అంగట్లో సరుకుల్లా TSPSC పేపర్లు అమ్ముకున్నందుకా.. పేపర్ లీకులు, పరీక్ష వాయిదాలు, కేసులు, కోర్టులు.. మీ పాలనలో నిరుద్యోగుల దుస్థితి ఇది. గద్దెనెక్కిన నాటి నుంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఉద్యోగం లేక ప్రాణాలు తీసుకుంటున్న చెట్టంత బిడ్డని కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల ఉసురు మీకు, మీ సర్కార్ కు తగలక మానదని వైస్ షర్మిల ట్విటర్ వేదికగా తెలిపారు.