Home   »  తెలంగాణవార్తలువ్యాపారం   »   ఓరుగల్లుకు నేడు రామన్న.. గులాబీ మయమైన వరంగల్‌

ఓరుగల్లుకు నేడు రామన్న.. గులాబీ మయమైన వరంగల్‌

schedule yuvaraju

వరంగల్‌: మంత్రి కేటీఆర్‌ పర్యటన శనివారం వరంగల్‌ జిల్లా కు రానున్నారు. ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు లో యంగ్‌వన్‌ కంపెనీ ఎవర్‌ టాప్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో చేపట్టే వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పార్కులో రూ.840కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యంగ్‌వన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్‌ఐఐసీ టెక్స్‌టైల్‌ పార్కులో యంగ్‌వన్‌ కంపెనీకి ఇటీవల 298 ఎకరాలను కేటాయించింది. తమ వస్త్ర పరిశ్రమల్లో 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించనున్నట్లు సౌత్‌కొరియాకు చెందిన యంగ్‌వన్‌ కంపెనీ పేర్కొంది. పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి లభించనుందని అధికారులు భావిస్తున్నారు.

భూమిపూజ అనంతరం వరంగల్‌ సమీకృత కలెక్టరేట్‌, వరంగల్‌ మోడల్‌ బస్‌స్టేషన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. ఓసిటీలో తూర్పు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం, దేశాయిపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, నగరంలో 16 స్మార్ట్‌ రోడ్లను ప్రారంభిస్తారు. సాయంత్రం ఆజంజాహి మిల్స్‌ గ్రౌండ్‌లో 50వేల మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా వరంగల్‌ నగరం గులాబీ మయమైంది.