Home   »  తెలంగాణవార్తలు   »   తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో తలసరి ఆరోగ్య బడ్జెట్‌ ను నాలుగు రెట్లు పెంచింది

తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో తలసరి ఆరోగ్య బడ్జెట్‌ ను నాలుగు రెట్లు పెంచింది

schedule raju

తెలంగాణ: ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా కేటాయింపులను గణనీయంగా పెంచింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది. 2014లో తలసరి ఆరోగ్య బడ్జెట్‌ రూ.925 కాగా, వైద్యరంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో 2023 నాటికి రూ.3,532కు పెరిగింది. అంటే 2014తో పోలిస్తే 2023-24 నాటికి తలసరి ఆరోగ్య బడ్జెట్‌ కేటాయింపు దాదాపు నాలుగు రెట్లు పెరగడం.. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. తొమ్మిదేళ్లలో రూ.2607 పెరుగుదల నమోదైంది. కేటాయింపులు పెరగడంతో కేసీఆర్ కిట్, అమ్మ ఓడీ, టీ డయాగ్నోస్టిక్స్ వంటి దేశానికే ఆదర్శప్రాయమైన పథకాలు అమలు చేసేందుకు అవకాశం ఏర్పడింది.

మరోవైపు దవాఖానల్లో సౌకర్యాలు బాగా పెరిగాయి. ఉదాహరణకు 2014లో రాష్ట్రంలో 1400 ఆక్సిజన్‌ ​​పడకలు మాత్రమే ఉంటే, 2023 నాటికి ఈ సంఖ్య 34 వేలకు చేరుతుంది. డయాలసిస్ సెంటర్లు కేవలం 3 నుంచి 102కి పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి.

CM కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్న జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు కూడా తుది దశకు చేరుకుంది. దీంతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలు రానున్నాయి. వైద్య సేవలు మెరుగుపడడంతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ఓపీ, ఐపీ, సర్జరీ ఇలా అన్ని విభాగాల్లో సేవలు పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జననాల రేటు 30 శాతం నుంచి 62 శాతానికి రెట్టింపు కాగా మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది.